కేంద్ర పథకాల పేర్లను మార్చొద్దని రాష్ట్రాలకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ హెచ్చరించారు. కొన్ని రాష్ట్రాలు నిబంధనలు, షరతులను ఉల్లంఘించి హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ స్కీం పేరుతో అమలు చేయకుండా తమ సొంత స్టిక్కర్లు వేసుకుంటున్నాయని, అలా చేస్తే ఆ పథకాన్ని నిలిపివేసినట్లు కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందని మాండవీయ హెచ్చరించారు. ఈ విషయంపై ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు లేఖ రాశామని చెప్పారు.
రాష్ట్రంలో అమలవుతోన్న ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వంటి పథకాల అమలుపై శుక్రవారం లోక్ సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అడిగిన ప్రశ్నకు మాండవీయ పై విధంగా స్పందించారు. ఆయుష్మాన్ భారత్ లో భాగంగా కేంద్రం ప్రారంభించిన హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ పథకం చాలా రాష్ట్రాల్లో అమలవుతోందని, ఈ పథకం కేంద్ర, రాష్ట్రాల 60:40 కంట్రిబ్యూషన్ తో నడుస్తుందోన్నారు. అయితే కేంద్ర పథకాలకు కొన్ని రాష్ట్రాలు పేర్లు మార్చి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని, నిభంధనలు పాటించకుండా, స్కీంతో ఏకీభవించకుండా పథకాలు అమలు చేస్తే తాము గ్రాంట్ లను నిలిపివేస్తామని హెచ్చరించారు.