త్రిపుర ముఖ్యమంత్రిగా రెండోసారి మాణిక్ సాహు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరో 8 మంది మంత్రులుగా కూడా ప్రమాణం చేశారు. అగర్తలాలోని వివేకానంద మైదాన్ లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండు, మణిపూర్ సీఎం బిరేన్ సింగ్, సిక్కిం సీఎం తమంగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాణిక్ సాహాకి వీరందరూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో త్రిపురలో 32 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మొత్తం 60 స్థానాలుండగా…. 32 స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగరేసింది. ఈ క్రమంలోనే మిత్రపక్షం IPFT తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే… ముఖ్యమంత్రి రేసులో సాహాతో పాటు ప్రతిమా భౌమిక్ పేరు కూడా వచ్చింది. అయితే… తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ సాహా వైపే మొగ్గు చూపారు. అంతేకాకుండా రాజకీయంగా సాహాకు క్లీన్ ఇమేజ్ కూడా వుంది. పైగా… ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత లేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీ మళ్లీ సాహాకే ఛాన్స్ ఇచ్చింది.