ఆప్ నేత, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియాను జైలులోనే ఈడీ అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని ఈడీయే ప్రకటించింది. అయితే… మొన్న అరెస్ట్ చేసింది సీబీఐ. ఈడీ కాదు. నేడు తాజాగా మళ్లీ ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కాంలో డబ్బుల లావాదేవీల అంశంలో విచారణ చేస్తున్న ఈడీ.. తన పరిధిలోని కేసు విచారణలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న సిసోడియాను అరెస్ట్ చేసినట్లు తెలిపింది.
నిజానికి గత రెండు రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై సిసోడియాను తిహార్ జైలులోనే ఈడీ విచారిస్తోంది. లిక్కర్ స్కాంలో డబ్బులు ఎలా చేతులు మారాయి.. ఎవరెవరి దగ్గర నుంచి ఏ రూపంలో వచ్చాయి అనే విషయాలపై ఆరా తీశారు. మరోవైపు శుక్రవారం సిసోడియాను ఈడీ కోర్టులో ప్రవేశపెట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలోని లావాదేవీలపై ఈడీ ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసింది.