గుజరాత్‌లోని సోమనాథ దేవాలయంపై మహమ్మద్ ఘజనీ దాడి చేసి, ధ్వంసం చేయలేదని, ఆ దేవాలయంలో జరిగే అనైతిక కార్యకలాపాలను ఆపాడని వ్యాఖ్యానించిన ముస్లిం మత పెద్ద, అఖిల భారత ఇమామ్ సంఘానికి అధ్యక్షుడు మౌలానా సాజిద్ రషీదీ క్షమాపణ చెప్పారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఓ కేసు నమోదైంది. మౌలానా రషీదీ గత నెలలో కొన్ని వార్తా చానళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మహమ్మద్ ఘజనీ సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేయలేదని, అక్కడ జరిగే అనైతిక కార్యకలాపాలను ఆపాడని చెప్పుకొచ్చారు. హిందూ దేవతలు, విశ్వాసాల పేరుతో ఆ దేవాలయంలో అనైతిక కార్యకలాపాలు జరుగుతూ ఉండేవని చరిత్రను బట్టి తెలుస్తోందని చెప్పారు.
ఈ విషయాలను ధ్రువీకరించుకున్న తర్వాత ఘజనీ ఆ దేవాలయంపై దాడి చేశాడని ఆరోపించారు. ఆయన దేవాలయాన్ని ధ్వంసం చేయలేదని, తప్పుడు పనులను మాత్రమే ఆపాడని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 153ఏ, 295ఏ ప్రకారం ప్రభాస్ పటాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొడుతున్నారని, మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో ద్వేషపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు నమోదయ్యాయి. శ్రీ సోమనాథ్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ విజయ్ సింహ్ చావ్డా ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశారు.