నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన మెడికో ప్రీతి ధరావత్ అంత్యక్రియలు స్వగ్రామంలో ముగిశాయి. జనగామ జిల్లా స్వగ్రామం గిర్నితండాలోని ప్రీతి ఇంటికి సమీపంలోని వారి వ్యవసాయ పొలం వద్ద కుటుంబీకులు మృత దేహాన్ని పూడ్చిపెట్టారు. అంత్యక్రియల సందర్భంగా ప్రీతి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక.. ప్రీతి అంత్యక్రియలకు గ్రామస్థులు, స్థానికులు, వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఇంటి నుంచి పొలం వరకూ ప్రీతి మృత దేహాన్ని కుటుంబీకులు ట్రాక్టర్ లో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కుటుంబీకులు నినాదాలు చేశారు. మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని గ్రామస్థులు, నేతలు డిమాండ్ చేశారు. మరో వైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇక…సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఎంజీఎం పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి మృతదేహం (Dead body) స్వగ్రామానికి చేరుకున్నది. గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రీతి.. ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతిచెందింది. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోస్టుమార్టం పూర్తవడంతో వైద్యులు ఆమె భౌతికకాయాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇక ప్రీతి మృతితో తండా పరిసర ప్రాంతాలన్నీ పోలీసుల సెక్యూరిటీతో నిండిపోయాయి. ఆందోళనల నేపథ్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరించి, భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరో వైపు నిమ్స్ వద్ద అర్ధరాత్రి వరకూ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాకతీయ మెడికల్ కళాశాల HOD ని సస్పెండ్ చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ప్రీతి కుటుంబీకులు డిమాండ్ చేశారు. అసలు తన కుమార్తె ఎలా చనిపోయిందో తెలిపే సమగ్ర నివేదిక కావాలని తండ్రి నరేంద్ డిమాండ్ చేశారు. మరణానికి కారణాలు చెప్పాలని, లేదంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.