చిత్రపురి కాలనీలో చిరంజీవి హాస్పిటల్ కట్టబోతోన్నారని ఇది వరకే ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దానికి కార్యరూపం దాల్చినట్టు కనిపిస్తోంది. మెగా స్టార్ చిరంజీవి తాజాగా ఓ ప్రకటన చేశాడు. చిత్రపురి కాలనీలో కట్టించే హాస్పిటల్ మీద ఓ ప్రకటన వచ్చేసింది. చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన క్రికెట్ కార్నివాల్ జెర్సీ లాంచింగ్ కార్యక్రమంలో చిరంజీవి ఈ విషయాన్ని ప్రకటించాడు. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్‌లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలోని కార్మికులందరిలోనూ ఆనందం రెట్టింపు అయింది. ఈ మేరకు క్రికెట్ కార్నివాల్ ఈవెంట్,జెర్సీ లాంచింగ్ కార్యక్రమంలో చిరంజీవి చేసిన ప్రకటన ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. ‘నేను చిత్రపురి కాలనీలో హాస్పిటల్ కట్టాలనే ఆలోచన వచ్చింది. వచ్చిన క్షణం నుంచి దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలా? అని ఆలోచిస్తూ ఉన్నాను. పది పడకల హాస్పత్రిని కట్టాలని అనుకుంటున్నాను. పెద్ద హాస్పిటల్స్‌కు వెళ్లే అవసరం లేకుండా.. బీపీఎల్ కుటుంబాలు, రోజూ వారి శ్రామికులకు అవసరం అయ్యేలా చిత్రపురి కాలనీలోకట్టాలని అనుకుంటున్నాను. పెద్ద పెద్ద డాక్టర్లంతా కూడా నా మిత్రులే. వారి సాయంతో నేను ఇది చేయగలను. చేస్తే వచ్చే తృప్తి అంతా ఇంతా కాదు. ఈ ఆలోచన చెప్పడంతో నాకు సహకరించిన నా తమ్ముళ్లందరికీ థాంక్స్. మా నాన్న గారు పేరు కొణిదెల వెంకట్రావు గారి పేరు మీద ఈ హాస్పిటల్ కట్టాలని అనుకుంటున్నాను. ఈ బర్త్ డేకు ఇది ప్రారంభించి.. వచ్చే బర్త్ డే లోపు దాని సేవలు ఆరంభమయ్యేలా చూస్తానని మాటిస్తున్నాను. దానికి ఎన్ని కోట్లు ఖర్చైనా సరే.. ఎవరైనా భాగస్వామ్యులు అవుతానన్నా సరే.. సంతోషంగా వారికి కూడా ఆ ఆనందం, అనుభూతి ఇస్తాను.. లేదంటే మొత్తం ఖర్చు నేను పెట్టుకునే శక్తి ఉంది.. ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు.. మన ఎదుగుదలకు పరోక్షంగా, ప్రత్యక్షంగా కారణమైన మా వర్కర్లకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను’ అని మెగాస్టార్ చెప్పుకొచ్చాడు.
