రావు గోపాల రావు… తెలుగు ఇండస్ట్రీలో ఓ విలక్షణ నటుడు. మనిసన్నాక కూసింత కళాపోసణ ఉండాలి అన్న డైలాగే గుర్తొస్తుంది. పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అలనాటి నటుడు రావు గోపాలరావును గుర్తు చేసుకున్నారు. ఆయన టైమింగ్ అద్భుతమంటూ నెమరేసుకున్నాడు. ఇప్పుడు రావు గోపాల రావు కుమారుడు రావు రమేశ్ నటన తనకెంతో ఇష్టమని, విభిన్న పాత్రలను చేస్తూ గొప్ప నటుడు అవుతున్నారని ప్రశంసించారు.
తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తూ, ఉత్తమమైన పాత్రలు వేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారని చెప్పుకొచ్చారు. రమేశ్.. సినిమా రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చిరు వెల్లడించారు.
ఇక.. ఆ రోజుల్లో రావు గోపాల రావు తననెంతో అభిమానించే వారని, తన కోసం టిఫిన్ క్యారేజీ తీసుకొచ్చేవారని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన్ను చిన్న మామయ్య అని పిలిచేవారిమని, ఎందుకంటే తన మామ అల్లు రామలింగయ్య, రావు గోపాల్ రావుది అన్నదమ్ముల అనుబంధంగా వుండేదని చిరు గుర్తు చేసుకున్నారు.
రావు గోపాల రావు సతీమణిని తాను అత్తయ్య అని పిలిచేవాడినని, తన కోసం ప్రత్యేకంగా తులసీ చారును ఆవిడ పంపించేవారని అన్నారు. ఇక.. వంకాయ కూరని శ్రీదేవి బుగ్గల్లా రావు గోపాల రావు అన్వయించేవారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. అయితే.. చిరంజీవి చెబుతున్న ఈ మాటలను రావు గోపాల రావు శ్రద్ధగా విన్నారు. ఉద్వేగభరితమై.. చిరు పాదాలకు నమస్కరించారు. దీంతో చిరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.