సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నేపథ్యంలో సిటీ పోలీసులు జంట నగరాల్లో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని మోదీ భద్రత నేపథ్యంలో పలు చోట్ల ట్రాఫిక్ ను మళ్లించారు. అదే రకంగా మెట్రో రైల్ ప్రయాణికులకు పోలీసులు పలు సూచనలు చేశారు. ఆదివారం సాయంత్రం 5:30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు మెట్రో స్టేషన్లను మూసేస్తున్నట్లు ప్రకటించారు. పారడైజ్, పరేడ్ గ్రౌండ్స్, జేబీఎస్ మెట్రో స్టేషన్లను మూసేస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు.
ఈ మూడు స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆగవని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రధాని మోదీ భద్రత నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మెట్రో అధికారులు వెల్లడించారు. మిగిలిన స్టేషన్లలో మాత్రం మెట్రో రైళ్లు యథావిథిగానే నడుస్తాయని స్పష్టం చేశారు. ఈ మూడు మెట్రో స్టేషన్లు మాత్రమే మూసేస్తామని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని అధికారులు సూచించారు.