ప్రపంచ శాంతి కోసం ఐదేళ్ల కాలానికి ఆయా దేశాల మధ్య సంధిని ప్రోత్సహించేలా ముగ్గురు ప్రపంచ నాయకులతో కూడిన అత్యున్నత కమిషన్‌ని రూపొందించనున్నారు. ఐతే మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఆ కమిషన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉండాలని ప్రతిపాదించారు.ఈ మేరకు ముగ్గురు ప్రపంచ నాయకులతో కూడిన కమిషన్‌లో భారత ప్రధాని పేరుని ప్రతిపాదించినట్లు తెలిపారు. తాను రాత పూర్వకంగా ఒక ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితికి అందజేస్తానని కూడా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపేలా ఐదేళ్ల సంధి కాలానికి ఒక ఒప్పందం కుదుర్చునేలా ప్రతిపాదన సమర్పించడం ఈ కమిషన్ లక్ష్యం.
ఈ అత్యున్నత కమిషన్‌లో పోప్ ఫ్రాన్సిస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తోపాటు భారత ప్రధాని మోదీ ఉండాలని మెక్సికో అధ్యక్షుడు ప్రతిపాదించారు. ఆ ముగ్గురు నాయకులు ప్రతి చోట యుద్ధాన్ని ఆపేసేలా ఒక ప్రతిపాదనను అందజేయడమే కాకుండా ఐదేళ్ల యుద్ధాన్ని నిలిపేసేలా ఐదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంటారు.తద్వారా ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు తమ ప్రజలను ఆదుకోవడమే కాకుండా ఉద్రిక్తతలు తలెత్తకుండా శాంతిగా ఉంటాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదిక చర్యలకు స్వస్తి పలకాలని పిలుపునిస్తూ మెక్సికో అధ్యక్షుడు రష్యా, చైనా, అమెరికా వంటి దేశాలను శాంతిని కోరేందుకు ఆహ్వానించారు.