అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అగ్నివీరులుగా పనిచేసి రిటైర్ అయిన వారికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ఠ వయోపరిమితిలో కూడా కేంద్ర హోంశాఖ వయో పరిమితిలో సడలింపునిచ్చింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్ట్, 1968, (50 ఆఫ్ 1968) ప్రకారం చేసిన నిబంధనలను సవరించిన తర్వాతే ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
“ఖాళీలలో పది శాతం మాజీ అగ్నివీరుల కోసం రిజర్వ్ చేయబడుతుంది” అంటూ ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. మాజీ అగ్నివీర్‌ల మొదటి బ్యాచ్ అభ్యర్థులకు ఐదేళ్ల వరకూ, ఇతర బ్యాచ్‌ల అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయో పరిమితిలో సడలింపునిచ్చింది. అయితే… కొన్ని రోజుల క్రిందటే BSF లోనూ ఇలాంటి సౌలభ్యాన్నే కల్పించింది. ఉద్యోగ ఖాళీల్లో 10 శాతం మేర ఉద్యోగాలు వీరికోసం రిజర్వు చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.