తెలంగాణ మంత్రి హరీశ్ రావు బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. డబుల్ ఇంజన్ పాలన అంటే తిరోగమన పాలన అంటూ ఎద్దేవా చేశారు. మోదీ సర్కార్ అన్ని రంగాల్లోనూ విఫలమైందని విమర్శించారు. యూపీతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం మూడు రెట్లు ఎక్కువగా వుందన్నారు. మంత్రి హరీశ్ రావు టీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నిధులు అందాయా? అని అడిగే కంటే ముందు తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా చెప్పాలని డిమాండ్ చేశారు. నిధులు, నియామకాల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని మంత్రి ఫైర్ అయ్యారు.
మోదీ రెండు కోట్ల ఉద్యోగాల నియామకాల ప్రకటన ఓ బోగస్ అంటూ మండిపడ్డారు. తమ వైపు ఒక్క వేలు చూపితే.. వారి వైపు రెండు వేళ్లు చూపిస్తాయంటూ మండిపడ్డారు. కేంద్రంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలని హరీశ్ మండిపడ్డారు. బహిరంగ సభ ద్వారా నేతలు మాట్లాడిన మాటల్లో విషం తప్ప ఏమీలేదన్నారు. చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదని, ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. కాళూశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చారని, అవినీతి జరగలేదని సర్టిఫికేట్ కూడా ఇచ్చారని హరీశ్ గుర్తు చేశారు. ఎంత సేపూ అధికారంలోకి వస్తామనే చెప్పడం తప్పించి, తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.