పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ అయిందని, దీని వల్ల దేశానికి రూ. 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుపేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు, దాని పర్యావసనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. నోట్ల రద్దు తర్వాత ఫేక్ కరెన్సీ 54 శాతం పెరిగిందని, నగదు చలామణి రెట్టింపు అయిందన్నారు. అవినీతి పెరిగిందని, కేంద్రం చెప్పేదానికి.. చేసేదానికి.. జరిగే దానికి పొంతన ఉండదని విమర్శించారు.
డీమానిటైజేషన్ (Demonetization)తో పెద్ద నోట్ల చలామణి తగ్గలేదని, చలామణిలో ఉన్న నగదుపై కేంద్రం చెప్పేవన్నీ అబద్ధాలేనని విరుచుకుపడ్డారు. జన్ధన్ ఖాతాలంటూ ప్రజలను మోసం చేశారన్నారు. కేంద్రం చెప్పిన డీమానిటైజేషన్ లక్ష్యాలు ఒక్కటి కూడా నెరవేరలేదని ఎద్దేవా చేశారు. ప్రధాని చెప్పిన 5 ట్రిలియన్ ఎకానమీ ఒక జోక్ అన్నారు. పెద్ద నోట్ల మార్పు కోసం క్యూలైన్‌లో నిలబడి 108 మంది చనిపోయారని, పెద్ద నోట్ల రద్దు వల్ల 62 లక్షల మంది ఉపాధి కోల్పోయారని మంత్రి హరీశ్ అన్నారు.