ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరిన రోగులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ఒక్కో భోజనానికి 80 రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. పేషెంట్లకు సహాయకారులుగా వచ్చిన వారికి 3 పూటలా 5 రూపాయలకే అల్పాహారం, భోజనం అందుబాటులో వుంటుందని తెలిపారు. భోజనామృతం, అన్నపూర్ణ, సద్దిమూట… ఇలా పేరు ఏదైనా, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ట్రస్ట్‌తో కలిసి ప్రభుత్వం లక్షల మంది ఆకలి తీర్చడం జరుగుతుందని తెలిపారు. నార్సింగిలోని హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన సెంట్రలైజెడ్ కిచెన్‌ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
జీహెచ్ ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు 5 రూపాయలకే భోజనం ఇస్తున్నామని తెలిపారు. అన్ని జిల్లాల నుంచి చికిత్స కోసం పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారని, ఒక్కో రోగి వెంట ఇద్దరు సహాయకులు కూడా వస్తుంటారని హరీశ్ వివరించారు. సర్జరీలు జరిగినప్పుడు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు చికిత్స కోసం రోగులు, వారి అటెండెంట్స్ రోజుల తరబడి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితులను అర్థం చేసుకొని రోగులకు, వారి సహాయకులకు భోజనం అందిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ఇలాంటి సెంట్రలైజ్డ్ కిచెన్లు మొత్తం నాలుగు ఏర్పాటు చేశామని.. నార్సింగి కిచెన్ ద్వారా ప్రతిరోజు లక్ష మందికి భోజనాలు సరఫరా చేయడం జరుగుతుందని హరీష్ రావు తెలిపారు.