Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సీజనల్ వ్యాధుల నియంత్రణా ప్రత్యేక అధికారిగా శ్వేతా మహంతి… ప్రకటించిన సర్కార్

వర్షాలు పడుతున్నాయని, ఈ సమయంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు అధికారులను హెచ్చరించారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మలేరియా కేసులు పెరుగుతున్నాయని మంత్రి అన్నారు. డెంగ్యూ, మలేరియా ఇతర సీజనల్ వ్యాధులపై మంత్రి హరీశ్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రజలు, అధికారులు అలర్ట్ గా వుండాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో డెంగీ, రూరల్ ప్రాంతాల్లో మలేరియా వ్యాప్తి చెందుతున్నాయన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లో డెంగీ ఎక్కువగా వుందని, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో మలేరియా వుందని వెల్లడించారు. ఇక… వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక అధికారిగా శ్వేతా మహంతిని నియమిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

 

ఇక… జిల్లాల్లో వ్యాధులు వ్యాప్తి చెందకుండా అన్ని జిల్లాల్లో కిట్స్ అందుబాటులో వుంచామని మంత్రి హరీశ్ తెలిపారు. ప్రజలెవ్వరూ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లొద్దని, సర్కారు ఆస్పత్రుల్లోనే వైద్య సేవలు పొందాలని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్లేట్ లెట్స్ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు వుంటాయని హెచ్చరించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అలాగే పాఠశాలల్లో ఫ్రైడే కార్యక్రమాలు చేస్తామని వివరించారు. అంటు వ్యాధులు ప్రబలే సీజన్ కాబట్టి… రాష్ట్ర ప్రజలందరూ తమ పరిసరాలను, ఇళ్లను అత్యంత పరిశుభ్రంగా వుంచుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

 

దోమల నివారణకు చర్యలు తీసుకోండి…

సీజనల్ వ్యాధులు ప్రబలే ఛాన్స్ వున్నందున అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తగిన చర్యలు చేపట్టాలని సీడీఎంఏ డైరెక్టర్ సత్యానారాయణ ఓ సర్క్యులర్ జారీ చేశారు. దోమలతోనే డెంగ్యూ, మలేరియా, చికిన్ గున్యా వస్తున్నందున.. వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే 10 వారాల పాటు ప్రతి శుక్రవారం, ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు.

 

మంకీపాక్స్ లక్షణాలుంటే.. ఫీవర్ ఆస్పత్రికి వెళ్లండి….

మంకీపాక్స్ లక్షణాలుంటే వెంటనే నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్ కు వెళ్లాలని మంత్రి హరీశ్ రావు ప్రజలను కోరారు. విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్ పోర్టులోనే పరీక్షలు చేయాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించారు. రాష్ట్రంలో మంకీపాక్స్ అనుమానిత కేసు వున్నదని, ఫీవర్ ఆస్పత్రిలో ఐసోలేషన్ లో ఆ బాధితుడ్ని వుంచామని వెల్లడించారు. ఇప్పటికే పూణెలోని వైరాలజీ ల్యాబ్ కు అతని శాంపిల్ ను పంపామని, ఒకవేళ పాజిటివ్ అయితే ఆ వివరాలను కేంద్రమే అధికారికంగా ప్రకటిస్తుందని హరీశ్ రావు తెలిపారు.

Related Posts

Latest News Updates