వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ట్రాప్ లో కోటంరెడ్డి పట్టారని అన్నారు. అక్కడ జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదని, మ్యాన్ ట్యాపింగ్ అంటూ విమర్శించారు. చంద్రబాబు కోటంరెడ్డిని ట్యాప్ చేశారని ఆరోపించారు. జగన్ స్థానంలో ఎవరున్నా… కోటంరెడ్డికి సీటు దక్కేదే కాదన్నారు. 2014 ఎన్నికల సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం విషయంలో ఎంత పోటీ వుందనేది కోటంరెడ్డికి తెలుసన్నారు. పార్టీ మారాలన్న నిర్ణయం తీసుకోవడం కోటంరెడ్డి వ్యక్తిగత నిర్ణయమని, కానీ… వైసీపీపై బురదజల్లడం సరికాదన్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇన్ని రోజులు కోటంరెడ్డి కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అది ఆడియో రికార్డ్ అని తెలుసు కాబట్టే కోటంరెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అభ్యర్థిగా కోటంరెడ్డి ఖరారయ్యారని, అందుకే ఇలా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోటంరెడ్డి జగన్ కి వీరవిధేయుడు కారని, వేరే వాళ్లకు వీధేయుడని ఎద్దేవా చేశారు. కోటంరెడ్డి ఈ స్థాయిలో వుండడానికి సీఎం జగనే కారణమని, టిక్కెట్ రాకంటే మునుపు అందరూ జీరోలేనని మంత్రి కాకాణి అన్నారు. కోటంరెడ్డిని పావుగా చేసుకొని, చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, శ్రీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఆయనకు ఆత్మహత్య లాంటిదని అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి వివాదం వైసీపీలో ఇంకా నడుస్తూనే వుంది. తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి వైసీపీ సీనియర్ నేత సజ్జలపై తీవ్రంగా మండిపడ్డారు. ఇసుకాసురులు, మద్యం వ్యాపారుల ఆడియోలు రిలీజ్ చేస్తే.. మరుసటి రోజే సజ్జల పోస్ట్ ఊడిపోతుందన్నారు. తనను అరెస్ట్ చేస్తారంటూ సజ్జల లీకులు ఇస్తున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు. అధికారం ఉంది కదా అని తనపై మాటల దాడి చేస్తున్నారని మండిపడ్డారు. సజ్జల కుమారుడు భార్గవ రెడ్డి పార్టీకి ఏం చేశారని పదవులిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.