జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తామసలు గుర్తించడమే లేదని ఎద్దేవా చేశారు. నిబద్ధత లేని వ్యక్తి గురించి, ఆ పార్టీ గురించి గానీ మాట్లాడాల్సిన అవసరం తమకు లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ స్థాయి తోలుబొమ్మలాటలో జోకర్ స్థాయి మాత్రమేనని దెప్పిపొడిచారు. పవన్ గురించి నన్ను అడిగి అవమానించొద్దు. రెండు సార్లు గెలిచిన నన్ను… రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ గురించి అడగొద్దు అంటూ పేర్కొన్నారు.
ఇక… వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే వెళ్తామని, పొత్తులు తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్యాకేజీలు చెల్లిస్తే కలిసిపోయే పార్టీ తమదని కాదని దెప్పిపొడిచారు. ప్రజల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి ఏమాత్రం విశ్వసనీయత లేదని, 5 సంవత్సరాల పాటు పాలించిన చంద్రబాబును ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. సీఎం పాలనలో ఏపీ ప్రజలు సంతోషంగా వున్నారని కాకాణి గోవర్ధన్ పేర్కొన్నారు. అయితే… ముఖ్యమంత్రి జగన్ వేసిన సవాలును స్వీకరించే దమ్ము చంద్రబాబుకి వుందా? అంటూ మంత్రి కాకాణి సవాల్ విసిరారు. 175 కి 175 స్థానాల్లో చంద్రబాబు పోటీ చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ సవాల్ ని స్వీకరించే దమ్ము లేక.. టీడీపీ ముఖం చాటేస్తోందని విమర్శించారు. టీడీపీ నేత లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రకు జనాదరనే లేదన్నారు.