అల్లూరి సీతారామ రాజు తెలుగు పౌరుషానికి ప్రతీక అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభివర్ణించారు. భీమవరం సమీపంలోని పెద్ద అమిరంలో జరిగిన సభలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీకి వచ్చిన ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి విల్లంబులు, విల్లు ఇచ్చి స్వాగతం పలికారు. ఆజాదీ కా అమృత మహోత్సవ్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ఎందరో బలిదానాలు చేశారని, కానీ అనేక కారణాల రీత్యా ఆ మహనీయుల చరిత్ర నవ తరానికి తెలియకుండా పోయిందన్నారు. ఆ మహనీయుల చరిత్ర నవ తరానికి తెలియాల్సిన అవసరం వుందన్నారు. ‘
అల్లూరి సీతారామ రాజు 125 సంవత్సరాల జయంత్యుత్సవాలు జరపాలని తాను ప్రధాని మోదీని కోరానని, అందుకు ఆయన అంగీకరించారని వెల్లడించారు. ఈ రోజు నుంచి జూలై 9 వరకూ దేశ వ్యాప్తంగా అల్లూరి సీతారామ రాజు జయంత్యుత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వహిస్తామని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని, అందుకు జగన్ సర్కార్ కు ధన్యవాదాలు తెలిపారు కిషన్ రెడ్డి. దేశ వ్యాప్తంగా ఎక్కడైతే అల్లూరి సీతారామ రాజు పర్యటించారో.. అక్కడ ఆ ప్రాంతాలను తీర్థయాత్ర కేంద్రాలుగా తీర్చి దిద్దుతామని తెలిపారు.
జయంత్యుత్సవాలు ఈ రోజుతో ముగియలేదని, ఈ రోజుతో ప్రారంభమైందని, ప్రతి గ్రామంలో ఈ సంవత్సరమంతా అల్లూరి పేరు మారు మోగాలని పిలుపునిచ్చారు. జయంత్యుత్సవాల్లో భాగంగా అల్లూరి కుటుంబీకులను కలుసుకుంటామని ప్రకటించారు. అల్లూరి సీతారామ రాజు ఉద్యమాలే కాకుండా.. పోరాటాలు కూడా చేశారని, ఆయనో పోరాట యోధుడు అని అభివర్ణించారు. ఆంగ్లేయులకు ముందే హెచ్చరికలు జారీ చేసి.. గిరిజనులతో కలిసి అనేక పోరాటాలు చేసి, ధైర్యాన్ని చూపిన యోధుడు అల్లూరి అని కిషన్ రెడ్డి అన్నారు.