వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా… వీరుడే అని తెలంగాణ ఐటీ మంత్రి కె. తారక రామారావు అన్నారు. మన్యం వీరుడ్ని గుర్తు చేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పుకొచ్చారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు 125 జయంత్యుత్సవాలను పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్ లోని ఖానామెట్ లో అల్లూరి భవన నిర్మాణం కోసం 3 ఎకరాల భూమిని సీఎం కేసీఆర్ కేటాయించారని తెలిపారు. మన్యం వీరుడి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జల్ జంగన్ జమీన్ నినాదంతో కొమురం భీమ్ తెలంగాణ ప్రాంత గిరిజనుల కోసం పోరాడారని, అదే విధంగా తెలుగు జాతిని ప్రభావితం చేసేలా అల్లూరి ఆంగ్లేయులపై వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు.