దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ ప్రభుత్వం ఎదిగిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నీటి తిప్పలు లేవని, సంక్షేమంలో ప్రభుత్వానికి తిరుగులేదని, దేశ ప్రజల చూపు ఇప్పుడు కేసీఆర్ వైపు వుందన్నారు. తెలంగాణ శాసభ సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణతో కేసీఆర్ కి వున్న బంధాన్ని ఎవరూ విడదీయలేరని, కేసీఆర్ పాలన తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న కేటీఆర్.. దేశానికి రాష్ట్రం ఆదర్శనంగా నిలుస్తోందని అన్నారు. ప్రభుత్వంలో పైరవీకారులకు చోటు లేదని, పథకాల కోసం లబ్దిదారులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని చెప్పారు.
ప్రత్యేక రాష్ట్ర నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అభివృద్ధి సాధించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న అనుమానాలను పటాపంచెలు చూస్తూ తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందని వివరించారు. ప్రతిపక్షమంటే పక్షపాతంగా వ్యవహరించాలని, ఎప్పుడూ విమర్శ చేయాలనుకోవడం సరికాదని అన్నారు. ప్రతిపక్ష నేతల పక్షపాత ధోరణి సరికాదని, దేశానికే దారిచూపే టార్చ్ బేరర్ గా తెలంగాణ మారిందన్నారు. రాష్ట్రాన్ని కించపరిచే విధంగా విమర్శలు చేయవద్దని కోరారు. తెలంగాణలో కోటి ఎకరాల పైచిలుకు మాగాణి వుందని, తెలంగాణలో 2 కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి పెరిగిందని ప్రకటించారు.
కరోనా సమయంలో 7 వేల కొనుగోలు కేంద్రాలతో ధాన్యం సేకరణ జరిగిందని తెలిపారు. రైతు బంధు అసాధారణమైన కార్యక్రమం అని పేర్కొన్నారు. 65 లక్షల మంది రైతులకు సీఎం కేసీఆర్ 65 వేల కోట్ల రూపాయలు జమ చేశారన్నారు. ప్రపంచంలోనే రైతు బంధు వినూత్నపథకమని, పార్టీలు, కులాలు, మతాలు అని చూడకుండా దీనిని అమలు చేస్తున్నామని కేటీఆర్ వివరించారు. 94 వేల కుటుంబాలకు పైగా రైతు బీమాతో ఆదుకున్నామని, పార్టీలు, రాజకీయాలు చూడకుండా సాయం అందిస్తున్నామని అన్నారు. నల్ల చట్టాలతో 700 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరు? అంటూ బీజేపీపై మండిపడ్డారు. దుర్మార్గంగా అన్యాయంగా మాట్లాడే ఇలాంటి ప్రధాని ప్రపంచంలో ఎక్కడా వుండని విమర్శించారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష గట్టిందని, అందుకే మోటార్లకు మీటర్లు అంటున్నారని మండిపడ్డారు. తాము రైతు రాజ్యం కావాలనుకుంటే.. బీజేపీ కార్పొరేట్ రాజ్యం కావాలంటోందని దుయ్యబట్టారు.