అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ వేదికగా జరగడం ఆనందకరంగా వుందని మంత్రి కేటీఆర్ అన్నారు. నెక్లెస్ రోడ్ లో ఫార్ములా ఈ కార్లు వేగంగా దూసుకెళ్తుంటే చూడడానికి బాగుందన్నారు. హైదరాబాద్ లోని యువత, స్పోర్ట్స్ మోటార్ ఔత్సాహికులు ఈ రేసును వీక్షించేందుకు తరలిస్తున్నారని అన్నారు. అయితే… ఈ కార్యక్రమంతో హైదరాబాద్ కి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రేస్ కారణంగా నగరవాసులకు కొంత అసౌకర్యం కలుగుతున్న విషయం వాస్తవమేనని, కానీ… ఓపికతో మన్నించి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు అంతర్జాతీయ ఫార్ములా ఈ రేసింగ్ ని చూసేందుకు సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రెటీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మరింత ఆకర్షణ నెలకొంది. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, శిఖర్ ధవన్, దీపక్ చాహర్, సినీ నటుడు నాగ చైతన్య, అఖిల్, మహేశ్ బాబు సతీమణి నమ్రత, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి తదితరులు హాజరయ్యారు.
హుసేన్‌సాగర్ తీరప్రాంతంలో 2.8కిలోమీటర్ల నిడివితో ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్‌పై మొత్తం 11 జట్లు, 22 మంది రేసర్లు తమ కార్లను పరుగులు పెట్టించనున్నారు. దాదాపు 21 వేల మంది పోటీలను వీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో రేసింగ్ నిర్వహించే ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, మింట్‌కాంపౌండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా మూసివేశారు. 300 మంది సివిల్, 270 మంది ట్రాఫిక్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి మరో 600 మంది పోలీసులు నియమించారు.