బీజేపీపై మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ వేదికగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. పాలమూరు నుంచి ఎంపీగా ప్రధాని మోదీ పోటీచేస్తారంటూ వార్తలు వస్తున్నాయని, ఏ మొహం పెట్టుకొని మోదీ పోటీ చేస్తారని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మోకాలడ్డినందుకు నీకు ఓటెయ్యాలా? కృష్ణా నీటిలో మా వాటా తేల్చకుండా నోట్లో మట్టికొట్టినందుకు ఓటెయ్యాలా? ఎందుకెయ్యాలి మోదీకి ఓటు అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు. మంత్రి కేటీఆర్ మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ ఒక్క రోజే నారాయణపేట జిల్లాలో రూ. 196 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని తెలిపారు. అద్భుతమైన కొత్త మార్కెట్‌ను నిర్మించారని ప్రశంసించారు. జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయానికి శంకుస్థాపనం చేశాం. కొద్ది నెలల్లోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి ప్రకటించారు.
పాలమూరులోనే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని, రోజూ కేసీఆర్ ను విమర్శించడం కాదని, నిజంగా మహబూబ్‌నగర్ ప్రజల మీద బీజేపీకి ప్రేమ ఉంటే తెలంగాణ ప్రభుత్వం కోరినట్టు 500 టీఎంసీల నీటిని వెంటనే కేటాయించాలని సమావేశాల్లో తీర్మానం చేసి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దమ్ముంటే పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని తీర్మానం చేయాలన్నారు. ఇవ్వాళ దేశంలో పుట్టే ప్రతి బిడ్డమీద రూ.1.25 లక్షల అప్పు మోపుతున్నది బీజేపీ కాదా ? అని ప్రశ్నించారు. వంద లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారని, పెట్రోల్, డీజీల్మీద అదనంగా సెస్ వేసి మరో రూ.30 లక్షల కోట్లు వసూలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా పనిమంతులకు పట్టం కట్టాలని ప్రజలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ కొట్టేలా దీవించాలని కోరారు. 2024లో కేంద్రంలో మనకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చేలా చేసుకొందామని తెలిపారు. రైతు వ్యతిరేకులను, పేదల వ్యతిరేకులను, ప్రజల మధ్య మతాల చిచ్చు పెట్టి నాశనం చేస్తున్న వాళ్లను తిప్పి కొట్టాలని పిలునిచ్చారు. దేశంలో ఇంతవరకు మోదీ లాంటి అసమర్థ ప్రధాని రాలేదని ధ్వజమెత్తారు.