తెలంగాణలో జీతాలు సరైన సమయంలో చెల్లించడం లేదని, ఆలస్యంగా చెల్లిస్తున్నారన్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉద్యోగుల జీతాల చెల్లింపులు ఆలస్యం కావడం పెద్ద విషయం కాదని అన్నారు. పరిస్థితులు బట్టి అలా జరుగుతూ వుంటాయని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల జీతాలను భారీగా పెంచింది సీఎం కేసీఆర్ మాత్రమేనని, రాష్ట్రంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. మోదీ దేశానికి ప్రధాని కాదని, గుజరాత్ కు మాత్రమే ప్రధాని అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైద్రాబాద్ లో వరదలు వస్తే..కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, గుజరాత్ కు ఇప్పటికే వెయ్యి కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారని గుర్తు చేవారు. ప్రైవేట్ పర్యటనకు మోదీ వస్తే.. సీఎం స్వాగతం పలకాల్సిన అవసరం లేదని, మన్మోహన్ ప్రధాని హోదాలో గుజరాత్ కు వెళితే… మోదీ స్వాగతం పలకలేదని కేటీఆర్ గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ సిరిసిల్ల పర్యటనపై కూడా మంత్రి కేటీఆర్ స్పందించారు. సిరిసిల్లకు రాహుల్ వస్తే స్వాగతిస్తామని, తమను చూసి నేర్చుకోవాలని కేటీఆర్ చురకలంటించారు. రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్ చచ్చిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమేథీలో రాహుల్, కొడంగల్ లో రేవంత్ ఓడిపోయి, సిరిసిల్లలో కాంగ్రెస్ ను గెలిపిస్తారట అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.