మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు భారీ వర్షాలు, వరదలు కష్టాలు పడుతుంటే… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం జాతీయ విపత్తు సహాయ నిధులు ఇచ్చిందంటూ కిషన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ (రాష్ట్ర విపత్తు సహాయ నిధులు) కి తేడా తెలియని వ్యక్తి కేంద్ర మంత్రిగా వున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ నెల 19 న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభలో చేసిన ప్రకటనను ఓసారి చదువుకోవాలని కిషన్ రెడ్డికి హితవు పలికారు. రాజ్యాంగంలోని 280 వ అధికరణ ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు ఎస్గీఆర్ఎఫ్ నిధలను కేటాయించాల్సిన బాధ్యత కేంద్రంపైనే వుందన్న విషయాన్ని కేంద్ర మంత్రి అర్థం చేసుకోవాలన్నారు.
2018 నుంచి ఇప్పటి దాకా తెలంగాణకు ఎన్డీఆర్ఎఫ్ ద్వారా అదనంగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదంటూ కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ చేసిన ప్రకటన తప్పా? అంటూ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. గతంలో హైదరాబాద్ లోని వరదలతో పాటు ప్రస్తుతం నెలకొన్న వరద పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఇవ్వాల్సిన ఎన్డీఆర్ఎఫ్ నిధులపై సమాధానం చెప్పాలని తాము డిమాండ్ చేస్తున్నామని, కానీ… కేంద్ర మంత్రి అబద్ధాలనే వల్లె వేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తన తోటి సహచర మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్ వేదికగా చెప్పింది తప్పా? అంటూ నిలదీశారు. సొంత రాష్ట్ర ప్రజలనే కిషన్ రెడ్డి తప్పు దోవ పట్టిస్తున్నారని, పైగా తమ ప్రభుత్వంపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, వెంటనే తమకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తౌక్టే తుపాను వల్ల గుజరాత్ లో 2021 లో వరదలు వస్తే.. ప్రధాని మోదీ వెంటనే సర్వే నిర్వహించారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్ ద్వారా వెయ్యి కోట్ల అదనపు సహాయాన్ని అడ్వాన్స్ రూపంలో వెంటనే చెల్లించారన్నారు. ఒక… బిహార్ కు 3,250 కోట్లు, మధ్యప్రదేశ్ కు 4,530 కోట్లు, కర్నాటకకు 6,490 కోట్లు, గుజరాత్ కు వెయ్యి కోట్లు మొత్తం 15,270 కోట్లు కేంద్రం ఇచ్చిందని, కానీ తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని కేటీఆర్ నిలదీశారు. అందరి లాగే తెలంగాణకు కూడా ఎన్డీఆర్ఎఫ్ నిధులను కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.