స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుజరాత్ లో 11 మంది రేపిస్టులను రిలీజ్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే… దీనిపై తెలంగాణ ఐటీ మంత్రి కె. తారక రామారావు ఫైర్ అయ్యారు. రేపిస్టులను విడుదల చేస్తూ ఇచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పంద్రాగస్టు రోజున జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ మహిళల గురించి చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
దేశ మహిళలను గౌరవించాలని మీరు మాట్లాడిన మాటల్లో నిజం ఉంటే, గుజరాత్ లో రిలీజైన 11 మంది రేపిస్టుల అంశంలో జోక్యం చేసుకోవాలని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని ప్రధాని మోదీని మంత్రి కేటీఆర్ కోరారు. రేపిస్టులను రిలీజ్ చేయరాదు అని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఉన్నా.. గుజరాత్ ప్రభుత్వం రేపిస్టులను రిలీజ్ చేసిన ఘటన వికారంగా ఉందన్నారు. దేశ ప్రజల పట్ల సరైన రీతిలో వ్యవహరించాలని ప్రధాని మోదీని కోరారు.రేపిస్టులకు కఠిన శిక్షను అమలు చేయాలని, ఆ దిశగా ఐపీసీ చట్టాలను సవరించాలని, రేపిస్టులకు బెయిల్ ఇవ్వకుండా చట్ట సవరణలు చేయాలని ప్రధాని మోదీని మంత్రి కోరారు.