బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలకి రాజకీయ జన్మనిచ్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు. 2004 లో టీఆర్ఎస్ టిక్కెట్ కోసం 33 మంది పోటీపడితే… కేసీఆర్ ఈటలకి టిక్కెట్ ఇచ్చారని, ప్రోత్సహించారని గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈటల అనే ఓ వ్యక్తి వున్నారని పరిచయం చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకొని ఈటల రాజేందర్ కేసీఆర్ పాలన అరిష్టమని మాట్లాడుతున్నారని, ఇది తగునా? అని ప్రశ్నించారు. 14 నెలల కింద జరిగిన బైపోల్ లో హుజూరాబాద్ ప్రజలు ఈటలను గెలిపించారని, కేంద్రం నుంచి ఈటల ఏం తెచ్చారని కేటీఆర్ నిలదీశారు.
తనను గెలిపిస్తే 3 వేల పింఛన్ ఇస్తానని ప్రకటించారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తీసుకొచ్చి, నిధుల వరద పారిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఏమైందన్నారు. ఈ 14 నెలల్లో కేంద్రం నుంచి రూపాయి అయినా… హుజూరాబాద్ కి వచ్చిందా? అని ప్రశ్నించారు. మోదీ దేవుడు అని బీజేపీ వారు అంటుంటారని, మోదీ ఎవరికి, ఎందుకు దేవుడని కేటీఆర్ మళ్లీ ప్రశ్నించారు. 400 సిలిండర్ ను 1200 చేసిందుకు దేవుడా? 2 కోట్ల ఉద్యోగాలని మోసం చేసినందుకు దేవుడా? అంటూ కేటీఆర్ ఎద్దేవా చేవారు. పేదలను కొట్టి, పెద్దలకు పెట్టే ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అని కేటీఆర్ అభివర్ణించారు. పెట్రోల్, డీజిల్ పై 30 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు ఏమయ్యాయని కేటీఆర్ నిలదీశారు.