తెలంగాణ ఐటీ మంత్రి కే. తారక రామారావు ఢిల్లీ వెళ్లారు. ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి టీఆర్ ఎస్ ప్రతినిధిగా హాజరుకానున్నారు. కేటీఆర్ తో పాటు పార్టీ ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్లారు. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వివిధ ప్రతిపక్షాల నేతలతో పాటు మంత్రి కేటీఆర్ కూడా ఆ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ఎంపీ నామా నాగేశ్వర రావు, రంజిత్ రెడ్డి, సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, ప్రభాకర్ రెడ్డితో పాటు ఇతర నేతలు ఢిల్లీకి పయనమయ్యారు.
కాంగ్రెస్, బీజేపీయేతర పక్ష అభ్యర్థిని రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ ప్రయత్నాలే చేశారు. దీనికి తగ్గట్టుగానే వివిధ రాష్ట్రాలకు కూడా తిరిగారు. అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రపతి అభ్యర్థి కోసం నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ వుంది కాబట్టే తాము హాజరు కావడం లేదని టీఆర్ ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే.. రెండోసారి జరిగిన సమావేశంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించారు. ఆ సమావేశానికి కూడా టీఆర్ ఎస్ దూరంగానే వుంది. అయితే ఎన్సీపీ అధినేత పవార్ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేశారు. ఈ సమయంలోనే యశ్వంత్ సిన్హాకు తమ మద్దతు వుంటుందని సీఎం కేసీఆర్ ఫోన్లో చెప్పారు.