ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్లడానికి రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సూటిగా స్పందించారు. 2023 లోనే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. తాము ముందస్తుకు వెళ్లమని కరాఖండిగా తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవ్వరికీ లొంగరని, భయపడరని కూడా స్పష్టం చేశారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు. తమ సిద్ధాంతం నచ్చిన వారు తమతో ఎప్పటికీ టచ్ లోనే వుంటారని పేర్కొన్నారు. రానున్న 3 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవి చూస్తుందని మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో వరదలు వస్తే కేంద్రం ఎలాంటి సహాయం చేయలేదని ఎద్దేవా చేశారు. తమ ఒక్క పార్టీయే రాష్ట్రమంతా వుందని, సర్వేలో పేర్కొంటున్నాయని ఉదహరించారు.
సీఎం కేసీఆర్ ను దొర దొర అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయని, ఎంత మందిని జైల్లో వేశారో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కొన్ని చోట్ల తమ పార్టీ నేతల మధ్య గొడవలు వుండటం సహజమని, తమ బలమేమిటో చూపిస్తోందన్నారు. బలంగా వున్న నేతలను పార్టీ కలుపుకొని పోతుందని, ఆ దిశగానే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ వివరించారు. బీజేపీ పాలిత ప్రాంతాల గ్రామాల్లో తాము తిరుగుతామని, తెలంగాణ పల్లెల్లో తిరుగుదామని, ఎవరు ఏం చేశారో తెలిసిపోతుందని కేటీఆర్ సవాల్ విసిరారు.