వేములవాడ ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు, సంబంధిత అధికారులతో కలిసి మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.వేములవాడ ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మహా శివరాత్రికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలన్నారు. వేములవాడ జాతరకు సౌకర్యాలు కల్పించేందుకు అదనపు నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. వేములవాడ గుడి చెరువును వరంగల్ బండ్ తరహాలో నిర్మించనున్నట్లు కేటీఆర్ చెప్పారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు భవిష్యత్తులో పర్యాటక ప్రాంతాలకు మారుపేరుగా నిలవనున్నాయని చెప్పారు. ఆ దిశగా వాటిని అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆదేశించారు.