బలగం ప్రీరిలీజ్ ఈవెంట్ సిరిసిల్లాలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. తెలంగాణ సాకారం అయిన తర్వాత జొన్నలగడ్డ సిద్ధు, నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి వంటి హీరోలందరూ సినిమాల్లో తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే మనందరి గుండెలు గర్వంతో ఉప్పొంగుతున్నాయన్నారు. మన యాస, భాష మాట్లాడటానికి మొహమాట పడ్డ రోజుల నుంచి నేడు టీవీలు మొదలుకొని వెండితెర వరకు తెలంగాణ యాస వినిపిస్తుందంటే ఆనందంగా వుందన్నారు. ఇందుకు ఒకే ఒక్క కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతోందన్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఏమీ వుండదని, అప్పడప్పుడూ చిన్న సినిమాలే ఊపేసే ఉప్పెనలు అవుతాయన్నారు. బలగం లాంటి మంచి సినిమాని తీసిన వేణుకి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హర్షిత్, హన్షితలు కొత్త పంథాలో ప్రయాణం చేస్తూ, తమదైన ముద్ర వేయాలని కోరుకుంటున్నామని ఆకాంక్షించారు.
సిరిసిల్లకు సినిమాను తెచ్చినందుకు వేణుకు కృతజ్ఞతలు తెలిపారు. గుండె లోతుల్లో చలనాన్ని కలిగించే ఏ భావోద్వేగమైనా ప్రజా బాహుళ్యంతో తప్పకుండా కనెక్ట్ అవుతుందని, ఈ సినిమాలో మానవ సంబంధాల్ని చాలా గొప్పగా ఆవిష్కరించారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సిరిసిల్ల గడ్డ మీద జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి, మిద్దె రాములు వంటి లబ్దప్రతిష్టులు జన్మించారని, నేడు తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవం జరుగుతున్నదంటే, ఇంతమంది అజ్ఞాత సూర్యులు తెరమీద వెలుగుతున్నారంటే తెలంగాణ ఉద్యమమే కారణమని వివరించారు.
ప్రత్యేక రాష్ట్రం లేకపోతే ఇంతమందికి అవకాశాలు దక్కేవి కావన్నారు. ప్రభుత్వ పరంగా తెలంగాణ సినిమాకు చేయాల్సింది చాలా వుందని, భవిష్యత్తులో అవన్నీ సాకారం చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు షూటింగ్‌ల కోసం పాపికొండలకు పోవాల్సిన అవసరం లేదని, మన సిరిసిల్ల రాజరాజేశ్వర సాగర్‌లో తిరుగుతుంటే పాపికొండల కంటే అద్భుతమైన అందాలు కనిపిస్తాయన్నారు. ఇల్లంతకుంట అన్నపూర్ణ రిజర్వాయర్‌కు పోతే ఐదు గుట్టల మధ్య అద్భుతమైన దృశ్యం కనిపిస్తుందన్నారు.
రంగనాయక్‌సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్..ఇవన్నీ కాళేశ్వరం ద్వారా కేసీఆర్‌గారు ఆవిష్కరించిన అద్భుతాలని వివరించారు. ఈ సినిమా తెలంగాణ పల్లెల సంస్కృతిని, తెలంగాణ కళాకారుల అద్భుతమైన ప్రతిభను వెలుగులోకి తెస్తుందని నమ్ముతున్నానని ఆకాంక్షించారు. ఈ నెల 3న థియేటర్లు మొత్తం నిండిపోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బలంగం సినిమా యూనిట్, దిల్ రాజు, సిద్దూ జొన్నలగడ్డ, తెలంగాణ రాష్ట్ర FDC చైర్మన్ అనిల్ కూర్మాచలం, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.