విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తమ పార్టీ మద్దతు కచ్చితంగా వుంటుందని తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ఈ నామినేషన్ ఘట్టం ముగిసిన తర్వాత మంత్రి కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీపై మండిపడ్డారు.
బీజేపీ తీరు నిరంకుశత్వంగా వుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముపై తమకు ఎలాంటి వ్యతిరేకతా లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే బీజేపీ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. బీజేపీ అక్రమాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోందన్నారు. 8 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజ రిజర్వేషన్లు పెంచాలని, గిరిజన రిజర్వేషన్ల మీద తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు.
8 సంవత్సరాల్లో ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ కంటే గట్టిగా సమాధానం చెప్పే సత్తా తమకు ఉందన్నారు. బీజేపీ అభ్యర్థి పేరుతో రాజకీయాలు చేస్తోదంటూ పైర్ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష అభ్యర్థికి తాము మద్దతిచ్చామని, అంతేగానీ విపక్ష కూటమిలో తాము లేమని కేటీఆర్ ప్రకటించారు.