TSPSC పేపర్ లీకేజీ అంశం అత్యంత విచారకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పులతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందన్నారు. ఇది వ్యవస్థ వైఫల్యం కాదని స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పుడు పనిని మొత్తం వ్యవస్థకు ఆపాదించడం సరికాదన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై బీఆర్‌కే భవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.పర్ లీకేజీ కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్ రెడ్డి వెనుకాల ఎవరున్నా వదిలిపెట్టం.. చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పే గానీ… సంస్థాగత వైఫల్యం కాదన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై వుందన్నారు.
రాజశేఖర్ రెడ్డి బీజేపీ పార్టీ క్రియాశీలక కార్యకర్త అని, ఆయన వెనుకాల ఎవరైనా ఉన్నారా..? ఏదైనా కుట్రకోణం ఉందా..? అన్న కోణంలో దర్యాప్తు చేయాలని డీజీపీని కోరుతున్నాను అని కేటీఆర్ తెలిపారు. ఇవేమీ నిరాధార ఆరోపణలు కావని, బీజేపీ కార్యకలాపాల్లో రాజశేఖర్ రెడ్డి పాల్గొంటున్నారని పేర్కొన్నారు. బీజేపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారని, ఆ పార్టీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయని తెలిపారు. అలాంటి వ్యక్తి దీని వెనుకాల ఉన్నాడంటే మాకు అనుమానం ఉంది అన్నారు.
TSPSC అనే సంస్థ దేశంలోనే అత్యుత్తమ సంస్థ అని కేటీఆర్ అన్నారు. ఎన్నో రకాల సంస్కరణలు, మార్పులు, కాలానుగుణంగా సాంకేతికను జోడించి కీలక నిర్ణయాలతో ముందుకెళ్తోందని తెలిపారు. అందులో భాగంగానే OTR ను తీసుకొచ్చామని తెలిపారు. డిజిటల్ ట్రాన్సక్షన్ల ద్వారా ఫీజుల చెల్లింపు, కంప్యూటర్ ఆధారిత టెస్టులను నిర్వహించే దానికి శ్రీకారం చుట్టామన్నారు.
సీబీటీ విధానంలో భాగంగా 99 పరీక్షలను నిర్వహించిందని, 4.5 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకురావలన్న ఉద్దేశంతోనే అనేక చర్యలు చేపట్టామన్నారు. సాంకేతికత, డిజిటలైజేషన్ ద్వారా అనేక పద్ధతులు తీసుకొచ్చిందని, యూపీఎస్సీ చైర్మన్ రెండు సార్లు రాష్ట్రానికి వచ్చి TSPSCని సందర్శించారన్నారు. దేశంలోని 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు, సభ్యులు ఇక్కడికి వచ్చి మనం తీసుకొచ్చిన మార్పుల్ని అధ్యయనం చేసి వారి రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేటీఆర్ అన్నారు.