ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులివ్వడంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అవి ఈడీ సమన్లు కావని, మోదీ సమన్లు అని అభివర్ణించారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలో బీఆర్ఎస్ పురోగమిస్తున్న విధానం, తెలంగాణలో ఒక అజేయమైన శక్తిగా ఎదిగిన విధానాన్ని గమనించిన తర్వాత ఎమ్మెల్సీ కవితకు కూడా ఈడీ సమన్లు పంపిందన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో, మల్లారెడ్డి నివాసంలో, తలసాని శ్రీనివాస్ పీఏ ఇంట్లో, జగదీశ్ రెడ్డి పీఏ ఇంటిపై దాడులు, ఎంపీ నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర నివాసాలపై కూడా ఈడీ సోదాలు చేసిందని గుర్తు చేశారు.
వీరందరిపై ఈడీ, సీబీఐ ని మోదీ ఉసిగొల్పారని మండిపడ్డారు. తెలంగాణలో ఒక అజేయమైన శక్తిగా ఎదిగిన విధానాన్ని గమనించిన తర్వాత ఎమ్మెల్సీ కవితకు కూడా ఈడీ సమన్లు పంపింది. ఇవి ఈడీ సమన్లు కాదు.. కచ్చితంగా మోదీ సమన్లు అంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలాగా మారాయాని కేటీఆర్ ధ్వజమెత్తారు. నీతిలేని పాలనకు నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు ఈ రోజు పర్యాయపదంగా మారింది ఎన్డీఏ ప్రభుత్వం అని కేటీఆర్ విమర్శించారు.
దేశంలో జుమ్లా లేదంటే హమ్లా అన్నట్లు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం ప్రతిపక్షాల మీద కేసుల దాడి, ప్రజల మీద ధరల దాడి చేస్తోందని మండిపడ్డారు. దేశమంతా అవినీతిపరులు తాము మాత్రం సత్యహరిశ్చంద్రుని కజిన్ బ్రదర్స్ అన్నట్లు బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరి బీజేపీ నేతలు మీద ఉన్న కేసులు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు.
మా ఎమ్మెల్సీ విచారణను ఎదుర్కొంటారని.. విచారణకు హాజరవుతారని స్పష్టం చేశారు . ఇది రాజకీయ వేధింపులుగానే చూస్తున్నామని.. అంతా డ్రామా నడుస్తుందన్నారు. రాజకీయంగా ప్రజాకోర్టులో తేల్చుకుంటామని.. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. అంతిమంగా న్యాయం గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.