ఢిల్లీ లిక్కర్ స్కాంలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. మనీష్ సిసోడియా అరెస్ట్ అప్రజాస్వామికమని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్షాల విషయంలో దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను విపక్ష నేతలపై ఉసిగొల్పుతోందని మండిపడ్డారు.
ప్రజాబలం అసలే లేక, అధికారంలోకి రాలేని రాష్ట్రాల్లో అక్కడి పార్టీలను బలహీన పరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, ఈ ప్రయత్నంలో భాగంగానే సిసోడియా అరెస్ట్ అని కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని, దానిని జీర్ణించుకోలేకే… సిసోడియాను అరెస్ట్ చేసిందని ఆరోపించారు. బీజేపీ తన పార్టీలోని అవినీతి నాయకులను సత్యహరిశ్చంద్రుని సహోదరులుగా చూపించి, ప్రతిపక్ష నేతలను అవినీతిపరులుగా చూపిస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో ఆదివారం విచారణకు పిలిచిన సిసోడియాను.. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించి, ఆ తర్వాత అరెస్టు చేసింది. సోమవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గత యేడాది అక్టోబర్ 17 న విచారించిన సమయంలో సిసోడియా కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పలేదు. దాటవేశారు. దీంతో సీబీఐ మళ్లీ ఆదివారం ఆయన్ను ప్రశ్నించింది. అయితే.. ఇప్పుడు కూడా సరైన జవాబులు ఇవ్వకుండా.. దాటవేత ధోరణి చూపించిన కారణంగానే అరెస్ట్ చేశామని సీబీఐ ప్రకటించింది.
మరోవైపు సిసోడియా అరెస్ట్ ను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని ఆప్ నిర్ణయించింది. అలాగే ఆప్ నేతల ఆందోళనలు, నిరసన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆప్ కార్యాలయం వద్ద కేంద్ర బలగాలను మోహరించారు. మరోవైపు సిసోడియా, సత్యేంద్ర జైన్ ను కేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.