గతంలో ఎన్నడూ లేని విధంగా జూలైలోనే అత్యధిక వర్షపాతం నమోదైందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రాథమిక సమచారం ప్రకారం సాధారణం కంటే 450 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని వెల్లడించారు. రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఒక్క ప్రాణ నష్టం కూడా ఉండొద్దని, అధికారులు నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ అధికారులతో పాటు ఇతర అధికారులు ప్రో యాక్టివ్ గా ఉండాలని కూడా కోరారు. చెరువులు, డ్యామ్ నుంచి నీటిని కిందికి విడుదల చేసే ముందు, ప్రజలకి, పోలీస్ రెవిన్యూ వంటి ఇతర శాఖలో ఉద్యోగులకు కూడా సమాచారం ఇవ్వాలన్నారు. మున్సిపాలిటీలతో సహా అన్ని గ్రామాల్లో సేఫ్టీ ఆడిట్ జరగాలని కేటీఆర్ అన్నారు. నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరికతో కూడిన సంకేతాలను పెట్టాలని, బారికేడ్లను కూడా నిర్మించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.