వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా కుప్పం నియోజకవర్గంలో పాగా వేస్తామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. కుప్పంలో పోటీ చేసే పరిస్థితి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో చిత్తూరులోని 14 నియోజకవర్గాలు తమవేనని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన కుటుంబం, తాను అవినీతికి పాల్పడుతున్నామని చంద్రబాబు పదే పదే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
అవినీతిని నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఒకవేళ.. దానికి విరుద్ధంగా తేలితే చంద్రబాబు గుండు కొట్టించుకుంటారా? అంటూ పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 95 శాతం హామీలను నెరవేర్చామని ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో కూడా ఏం చేస్తామో సీఎం జగన్ వివరిస్తారని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు పూర్తిగా వదిలేశారని, చిత్తూరు జిల్లాకు ఆయన ఎప్పుడు వచ్చినా… తనపైనే విమర్శలు చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి ఘాటుగా విమర్శించారు.