కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ రాజ్యసభలో సభా నాయకుడిగా తిరిగి నియమితులయ్యారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. పీయూష్ గోయల్ ప్రస్తుతం వాణిజ్యం, పరిశ్రమలు, ఆహార శాఖలను నిర్వహిస్తున్నారు. 2021 లో రాజ్యసభలో సభా నాయకుడిగా పీయూశ్ ను ప్రధాని మోదీ నియమించారు. ఆయన సమర్థత, నాయకత్వ లక్షణాలు, జవాబుదారీ తనాన్ని చూసి, మోదీ మళ్లీ పీయూశ్ ను సభా నాయకుడిగా నియమించారు. ఈ మధ్యే పీయూశ్ గోయల్ ను రాజ్యసభ సభ్యుడిగా ఆయన కాలాన్ని ప్రధాని మోదీ పొడిగించారు. ఈ నెల 8 న పీయూశ్ గోయల్ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 27 మంది సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గోయల్ మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
35 సంవత్సరాలుగా పీయూశ్ గోయల్ బీజేపీలో రకరకాల పదువులు నిర్వహించారు. పార్టీలో అత్యంత కీలకమైన కోశాధికారి పదవిని కూడా ఆయన నిర్వహించారు. జాతీయ కార్యవర్గ సభ్యునిగా కూడా కొనసాగారు. 2019 సాధారణ ఎన్నికల్లో ఆయన పార్టీ మేనిఫెస్టో, ప్రచార కమిటీ సభ్యులలో పీయూశ్ కూడా వున్నారు. కేంద్ర మంత్రి వర్గంలో నితిన్ గడ్కరీ తర్వాత పీయూశ్ గోయలే ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడని చెప్పుకుంటారు.