అర్హులైన కళాకారులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేస్తామని ఏపీ పర్యాటక, సాంస్కృతిక మంత్రి ఆర్కే రోజా ప్రకటించారు. వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. పల్లెల్లోని కళాకారులను గుర్తించేందుకు గ్రామ, వార్డు సచివాలయ సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. పర్యాటక,సాంస్కృతిక మంత్రి ఆర్కే రోజా గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పై విషయాలను ప్రకటించారు. జిల్లాల వారీగా కళారూపాల జాబితాలను సిద్ధం చేయాలని, ఆడిటోరియాల్లో వాటిని ప్రదర్శించాలని ఆదేశించారు. వీటితో పాటు…తమ ప్రభుత్వం తెలుగు కళా రూపాలను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో సాంస్కృతిక పోటీలను అధికారికంగా నిర్వహిస్తామని, విజేతలకు సీఎం జగన్ చేతుల మీదుగా బహుమతులు ఇప్పిస్తామని ప్రకటించారు.