ఓ వైపు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ సాగుతున్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్రానికి చేతనైతే విదేశాల్లో దాక్కున్న దొంగలను తీసుకురావాలి. కానీ ఆడబిడ్డలను గంటల తరబడి ఈడీ ఆఫీసు( ED Office )లో కూర్చోబెట్టడం సరికాదన్నారు. బీఆర్ఎస్, కేసీఆర్‌ను ఎదుర్కోలేక తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.బీఆర్ఎస్( BRS Party ) నేతలను గొంతు నొక్కాలని చూస్తే జరిగే పని కాదు. ఉద్యమాల గడ్డ తెలంగాణ కేసులకు భయపడేది లేదని మంత్రి స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ కవిత తన సెల్ ఫోన్లను ధ్వంసం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారని, అలా ఎలా ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. ఫోన్లు ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి ఏ ఆధారాలతో చెప్పారని నిలదీశారు. కానీ… నేడు ఎమ్మెల్సీ కవిత తన 9 సెల్ ఫోన్లను ఈడీకి సమర్పించిందన్నారు. కవిత ఏ తప్పూ చేయలేదు కాబట్టే భయపడటం లేదన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా బీజేపీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఒక మహిళ గోప్యత, ప్రతిష్ఠ దెబ్బతినేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మ్మెల్సీ కవితకు కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వేల కోట్లు ఎగవేసిన నీరవ్ మోదీ, లలిత్ మోదీని కేంద్రం ఎందుకు వదిలేసింది అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా ఎక్కడున్నారు..? దేశ సంపదను దోచుకుని లండన్ పారిపోయిన వారిని ఎందుకు రప్పించట్లేదని మంత్రి ప్రశ్నించారు.