తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నుంబెర్ వన్ గా ఎదిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అమెరికా లోని వాషింగ్టన్ డిసిలో జరిగిన 17వ ఆటా మహసభలకు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. అమెరికాలో వివిధ ప్రాంతాల్లో డాక్టర్స్ , ఐటీ వంటి వివిధ రంగాల్లో స్థిరపడి తెలుగు వారి గౌరవాన్ని కాపాడుతున్న ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. 17 వ ఆటా మహా సభల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మీ కృషి వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆయా రంగాల్లో మీ విజయాలు చూపిస్తున్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాలు అమెరికాలో ప్రత్యేక చోటు సంపాదించుకున్నాయని మంత్రి వేముల అన్నారు. దేశం కాని దేశంలో మన తెలుగు పండుగలు, సంస్కృతి సంప్రదాయాలను గొప్పగా చాటుతూ ఈ మహా సభలు నిర్వహించారని ప్రశంసించారు.