బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సభ ముగిసిన తర్వాత టీఆర్ఎస్ బీజేపీపై విమర్శలు చేసింది. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు బీజేపీపై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా మోదీ సమాధానం చెప్పలేదని, తమకు జవాబుదారీ తనం లేదని మోదీ నిరూపించుకున్నారని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి, తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి విధానాన్ని ఏమైనా ప్రకటిస్తారని ఆశించామన్నారు. కానీ.. కల్లిబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప ఏమీ మాట్లాడలేదని హరీశ్ ఎద్దేవా చేశారు.
తెలంగాణకు పనికొచ్చే ఒక్క ప్రకటన కూడా చేయలేదన్నారు. రాజ్‌కోట్‌కు ఎయిమ్స్, బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు. ఆయుర్వేదిక్ యూనివర్సిటీకి జాతీయ హోదా, ట్రెడిషనల్ మెడిసిన్‌కు గ్లోబల్ సెంటర్ మంజూరు చేశారు. మిషన్ యూపీ కింద రూ.55,563 కోట్లు, 9 మెడికల్ కాలేజీలు, కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రకటించారు. కర్ణాటకకు తుముకూర్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ముంబై–బెంగళూరు ఎకనామిక్ కారిడార్, మైసూర్ టెక్స్‌టైల్ మెగా క్లస్టర్.. వంటివి ఇచ్చారు. కానీ, తెలంగాణకు మొం డి చెయ్యి చూపారు’హరీశ్ రావు మండిపడ్డారు.
ట్విట్టర్ వేదికగా మండిపడ్డ మంత్రి కేటీఆర్..
బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మార్చుతామని జార్ఖండ్ మాజీ సీఎం రఘువర్ దాస్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అహ్మదాబాద్ పేరును అదానీబాద్ గా మీరు ఎందుకు మార్చకూడదు? అంటూ చురకలంటించారు. జుమ్లా జీవి ఎవరంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.