మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. అందించిన కొద్ది నిమిషాల్లోనే స్పీకర్ తన రాజీనామా లేఖను ఆమోదించారు. ఆ తర్వాత ఈ వార్తను స్పీకర్ ఈసీకి నివేదించనున్నారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైనట్లే. గుజరాత్, హిమచాల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే.. మునుగోడు ఉప ఎన్నిక కూడా జరగనున్నట్లు సమాచారం.
అంతకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంపై తాము ధర్మయుద్ధం ప్రకటించామని, ఈ యుద్ధంలో తెలంగాణ, మునుగోడు ప్రజలు కచ్చితంగా గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన రాజీనామాతో జరిగే ఉప ఎన్నికల్లో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇవ్వనున్నారని కోమటిరెడ్డి ప్రకటించారు.