తెలంగాణ కాంగ్రెస్ కు ఝలక్ తగిలింది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా క్షేమం కోసమే ఈ రాజీనామా అని ప్రకటించారు. ఆత్మ గౌరవం లేకుండా పదవిలో కొనసాగాల్సిన అవసరం తనకు లేదన్నారు. అధిష్ఠానం తప్పుడు నిర్ణయాల వల్లే కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందని విమర్శించారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడినా… కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఉప ఎన్నిక వస్తే.. ఎవరిని గెలిపించాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. కుటుంబ పాలనపైనే తన పోరాటమని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఉప ఎన్నిక జరిగితే నిధులు వస్తున్నాయని అంటున్నారని అన్నారు. దళితుడ్ని సీఎం చేస్తానని చెప్పి, సీఎం కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు.
మునుగోడు నియోజక వర్గ డెవలప్ మెంట్ ను సీఎం కేసీఆర్ పట్గించుకోలేదన్నారు. తెలంగాణ భవిష్యత్తు కోసమే తన పోరాటమని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అమ్ముడుపోవడం తన రక్తంలోనే లేదన్నారు. నీచ రాజకీయాల కోసమే తనపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. అసలు తాను ఏ తప్పు చేశానని అధిష్ఠానం తనపై చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎల్పీ, పీసీసీ అధ్యక్ష ఎన్నికల సమయంలో అధిష్ఠానం కనీసం అభిప్రాయాలు తీసుకోలేదని మండిపడ్డారు.