మునుగోడు ఉప ఎన్నిక రావడం ఖాయమని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అయితే.. మునుగోడు ప్రజలు నిర్ణయించిన తర్వాత యుద్ధం ప్రకటిస్తానని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ కోరుకుంటే మునుగోడు ఉప ఎన్నికలు రావని, అక్కడి ప్రజలు కోరుకుంటే వస్తాయని కౌంటర్ ఇచ్చారు. మునుగోడు తీర్పు తెలంగాణ మార్పుకు నాంది కావాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా కేసీఆర్ పై యుద్ధం ప్రకటిస్తామని, ఇది పార్టీల మధ్య యుద్ధం కాదన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న డెవలప్ మెంట్ అనేది కేవలం సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందన్నారు. కేసీఆర్ కు బుద్ధి చెప్పే ఎన్నిక కచ్చితంగా వస్తుందని, 10-15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తానని కోమటిరెడ్డి ప్రకటించారు.
మరో వైపు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ఎమ్మెల్యే కోమటిరెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ను వీడొద్దని, పార్టీలోనే కొనసాగాలని కోరారు. కోమటిరెడ్డిని బుజ్జగించే పనిని అధిష్ఠానం ఉత్తమ్ కు అప్పజెప్పింది. ఇందులో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డిని బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాతే ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఉప ఎన్నిక ఖాయమని ప్రకటించడం గమనార్హం.