జీహెచ్ ఎంసీ (GHMC) లో వెలుగు చూసిన నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల కుంభకోణం వెనుక ఎంఐఎం (MIM) కుట్ర వుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈ సర్టిఫికేట్ల కుంభకోణంపై సీబీఐ (CBI) తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పాత బస్తీలోనే ఎక్కువగా బర్త్ సర్టిఫికేట్లు వున్నాయని, ఇందులో ఉగ్రవాదులు కూడా వుండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎంఐఎం కి నకిలీ సర్టిఫికేట్లను తయారు చేయడం ముందు నుంచీ వున్న అలవాటేనని దెప్పిపొడిచారు.
బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, స్లీపర్ సెల్స్ కోసమే ఈ సర్టిఫికేట్లు తయారు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో 27 వేల బర్త్ సర్టిఫికేట్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? అంటూ ప్రశ్నించారు. ఇంకా ఎంత మంది హైదరాబాద్ నగరాన్ని ఉగ్రవాదుల అడ్డాగా మార్చారనుకున్నారో చెప్పాలని డిమాండ చేశారు. కేవలం నకిలీ సర్టిఫికేట్లే కావని, అక్రమ రేషన్ కార్గులు, ఓటర్ కార్డులు కూడా వున్నాయని రాజాసింగ్ పేర్కొన్నారు.
సరైన పత్రాలు లేకుండానే… హైదరాబాద్ లో GHMC అధికారులు 31 వేల బర్త్,డెత్ నకిలీ సర్టిఫికేట్లను జారీ చేసిన ఘటన ముదురుతోంది. 2020మార్చి నుంచి 2022 డిసెంబర్ వరకూ నాన్ అవెలెబిలిటీ కింద 27,328 బర్త్ సర్టిఫికేట్లు, మరో 4,126 డెత్ సర్టిఫికేట్లు జారీ అయ్యాయి. అత్యధికంగా మెహిదీ పట్నంలో 5877, చార్మినార్ 3949, బేగంపేట్ 2821, సికింద్రాబాద్ 1758 సంఖ్యలో నకిలీ బర్త్ సర్టిఫికేట్లను అధికారులు జారీ చేసేశారు.
ఇలా వ్యక్తుల మూలాలు తెలుసుకోకుండా, వారి ఆధారాలు సేకరించడకుండానే అధికారులు 31 వేల మందికి బర్త్, డెత్ సర్టిఫకేట్లను జారీ చేసేశారు. శాంతిభద్రతల కోణంలో చూసినా, దేశ సరిహద్దు కోణంలో చూసినా… ఇది అత్యంత ప్రమాదకరం. ముఖ్యంగా హైదరాబాద్ లో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు అత్యధికంగా వుంటున్నారు. వారు ఈ సర్టిఫికేట్లను దుర్వినియోగం చేసే ప్రమాదం చాలా వుంది. మున్సిపాలిటీ శాఖను కేటీఆర్ చూస్తున్నారు. కేటీఆర్ ఇంకా స్పందించలేదు.