మునుగోడు శాసనసభా సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు రాజీనామా చేయనున్నారు. తన రాజీనామా లేఖను తెలంగాణ స్పీకర్ కు అందజేయనున్నారు. శాసనసభా పతితో పాటు అసెంబ్లీ కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపిస్తానని ఆయన ప్రకటించారు. కొన్ని రోజుల క్రిందటే తాను బీజేపీలో చేరుతున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో కూడా భేటీ అయ్యారు. అయితే.. ఏ తేదీన ఆయన బీజేపీలో చేరనున్నారో మాత్రం ప్రకటించలేదు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే, బీజేపీలో చేరుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన సోమవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
మునుగోడు నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. మూడు సంవత్సరాలుగా తన నియోజకవర్గానికి నిధులు కేటాయించడం లేదని, నిర్లక్ష్యం వహిస్తున్నారని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. సిద్దిపేట, గజ్వేల్ మున్సిపాలిటీలు బాగా డెవలప్ అయ్యాయమని, కానీ… మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలు మాత్రం అధ్వాన్నంగా వున్నాయని పేర్కొన్నారు. రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారానే నియోజకవర్గానికి నిధులు వస్తాయని మరోసారి కోమటిరెడ్డి పేర్కొన్నారు.