అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభయ్యాయి. రెండో రోజైన నేడు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలో చర్చ జరుగనుంది. ఇందులో భాగంగా శాసనసభలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, శాసనమండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. మండలిలో రెండో తీర్మానాన్ని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, శాసనసభలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రవేశపెట్టనున్నారు. అనంతరం టేబుల్ ఐటమ్స్‌గా మంత్రులు వార్షిక నివేదికలను సభలకు సమర్పించనున్నారు.
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శానససభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రవేశపెట్టారు. దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా మారిందని చెప్పారు. సీఎం కేసీఆర్ నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. కంటివెలుగు లాంటి కార్యక్రమాన్ని పంజాబ్, ఢిల్లీలో చేపడతామని ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారని గుర్తుచేశారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ధాన్యం కొనుగోలుచేసి రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణలో ఉపాధి రంగం ఎంతగానో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఐటీ రంగంలో రూ.2 లక్షల 55 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దాదాపు 7 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించిందన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్సీ పల్లా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. 2014 నుంచి ఇప్పటివరకు ఆర్థిక వృద్ధిరేటు 128 శాతం పెరిగిందన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీ 11 లక్షల 48 వేల కోట్లకు చేరిందని వెల్లడించారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.3 లక్షల 17 వేలుగా ఉందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు జరుగలేదని విమర్శించారు. ఒక్క ఐఐటీ కూడా లేదని, గిరిజన యూనివర్సిటీ ఊసేలేదన్నారు. విభజన హామీల్లో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ సంగతి మరిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు.