తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC POLLING) కొనసాగుతోంది. తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏపీలోని 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈనెల 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తెలంగాణలో హైదరాబాద్ -రంగారెడ్డి -మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్ జరుగుతోంది.
శ్రీకాకుళం -విజయనగరం -విశాఖపట్నం, ప్రకాశం -నెల్లూరు -చిత్తూరు, కడప- అనంతపురం- కర్నూలు పట్టభధ్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు, ప్రకాశం -నెల్లూరు -చిత్తూరు, కడప -అనంతపురం -కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు, పశ్చిమగోదావరిలో 2, శ్రీకాకుళం, కర్నూలులో ఒక్కొక్కటి చొప్పున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు ప్రకటించారు. ఎన్నికల కోసం మొత్తంొ 1,538 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల భవిష్యత్తును 10,59,420 మంది ఓటర్లు నిర్ణయిస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ హాలులోకి ఎవ్వరూ వెళ్లడానికి వీల్లేదని అధికారులు పేర్కొన్నారు. 584 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు.