ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరసన దీక్ష ప్రారంభమైంది. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ తో కవిత దీక్షకు దిగారు. సాయంత్రం 4 గంటల వరకూ ఈ దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షకు దేశ వ్యాప్తంగా 18 పార్టీల ప్రతినిధులు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. తెలంగాణ నుంచి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ తో పాటు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. దేశంలోని మహిళా హక్కుల సంఘాలు, వివిధ పార్టీల నేతలు ఈ దీక్షకు హాజరుకానున్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ఈ దీక్షను ప్రారంభించి, ప్రారంభోపన్యాసం చేశారు.
ఇక… దీక్ష సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. బీజేపీకి పార్లమెంట్ లో పూర్తి మెజార్టీ వుందన్నారు. బీజేపీకి నిజంగా మహిళలపై ప్రేమ, చిత్తశుద్ధి వుంటే పార్లమెంట్ లో మహిళా బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయమని, మహిళా బిల్లు ఆమోదించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. మహిళల భాగస్వామ్యం లేనంత వరకూ సమాజం ముందుకు సాగదన్నారు. మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ హామీ ఇచ్చి, 9 సంవత్సరాలు గడించిందని, ఇప్పటి వరకూ బిల్లు ప్రవేశపెట్టలేదని మండిపడ్డారు.