ఢిల్లీ వేదికగా జరిగిన లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అయితే… ఈ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబీకులు కూడా వున్నారని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ చేసిన ఆరోపణలతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పింది. దీంతో టీఆర్ఎస్, కవితపై విపక్షాల దాడి మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీ ఎంపీపై పరువు నష్టం దావా వేయడానికి రెడీ అయ్యారు. బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మంజిందర్‌పై పరువు నష్టం దావా వేయనున్నట్లు పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కూడా కోర్టును అశ్రయించనున్నారు. ఇప్పటికే కవిత న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. కేసీఆర్ కూతురును కాబట్టే తనపై ఇలా ఆరోపణలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. కేసీఆర్‌ను మానసికంగా కృంగదీసేందుకే, బద్నాం చేసేందుకే బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. ఇలాంటి వాటికి భయపడేదే లేదని, బీజేపీ కక్ష పూరితంగానే నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిందన్నారు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌పై కొందరు తప్పుడు ప్రచారం చేశారని కవిత గుర్తు చేశారు.