ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ నిమిత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వరుసగా రెండో రోజు కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు కూడా ఆమె వెంట భర్త అనిల్, న్యాయనిపుణులు కూడా వున్నారు. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుంచి బయటకు రాగానే… ఎమ్మెల్సీ కవిత తనకు సంబంధించిన 10 సెల్ ఫోన్లను మీడియాకు చూయించారు. అలాగే విజయ సంకేతం చూపిస్తూ పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు.
అనంతరం తన లాయర్లతో కలిసి ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. లిక్కర్ స్కాంలో ఆధారాలను మాయం చేయడానికి కవిత 10 ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలోనే కవిత ఆ ఫోన్లను మీడియాకు చూపించారన్న వాదనలు వున్నాయి. తానేమీ ఫోన్లను ధ్వంసం చేయలేదని తన పాత ఫోన్లను కవిత ఈడీకి ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా తాను ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానన్న సంకేతాలు పంపడానికే కవిత ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈడీ విచారణకు హాజరయ్యే ముందు ఈడీ అధికారులకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రాజకీయ కోణంలోనే తనను విచారిస్తున్నారని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కవిత లేఖలో ఆరోపించారు. ఫోన్లను ధ్వంసం చేశానని చెబుతున్నారని, అందుకే తన పాత ఫోన్లన్నీ ఈడీకి ఇచ్చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. ఫోన్ల విషయంలో తనకు కనీసం సమన్లు కూడా జారీ చేయలేదని, కానీ.. తాను ఫోన్లను ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. మరో వైపు ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు కవిత న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. మరోవైపు కేంద్ర భద్రతా బలగాలు ఈడీ కార్యాలయానికి చేరుకున్నాయి.
ఉత్కంఠత వీడిపోయింది. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ పూర్తి చేసుకొని, ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి చేరుకున్నారు. దీంతో కవితను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. రాత్రి 9.10 గంటలకు ఈడీ ఆఫీసు నుంచి కవిత బయటకు వచ్చారు. అప్పటికే వర్షం పడుతుండటంతో వర్షంలోనే నడుచుకుంటూ ఈడీ ఆఫీసు గేట్ వరకు వచ్చిన కవిత.. వాహనంలో ఎక్కారు. ఈ సందర్భంలో అక్కడే ఉన్న కార్యకర్తలకు ‘వీ’ సింబల్ చూపిస్తూ… అభివాదం చేశారు.
పలువురు కార్యకర్తలు ఈడీ ఆఫీసు ముందే గుమ్మడి కాయతో దిష్టి తీశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు 10 గంటల పాటు విచారించారు. ఈ 10 గంటల్లో 14 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అందులో 100 కోట్ల ముడుపులు, సౌత్ లాబీయింగ్, సెల్ ఫోన్లను పగలగొట్టడం లాంటి ప్రశ్నలున్నట్లు తెలుస్తోంది.